‘ఉయ్యాలవాడ..’కి ఏఆర్ రెహ్మాన్

ar rahman replace thaman chirus uyyalawada narasimha reddy
ar rahman replace thaman chirus uyyalawada narasimha reddy

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కడానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో 151వ చిత్రంగా ఇలాంటి చారిత్రక నేపథ్యం.. తెలుగు గడ్డ పై పుట్టి బ్రిటీష్ వాళ్ళను ఎదురించిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథను తీసుకోవడంతో.. ఈ మెగా సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాను నిర్మాత రామ్ చరణ్ 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నేషనల్ లెవెల్ లో నిర్మించడానికి రెడీ అవుతుండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు బయటకు రాగా.. ఇప్పుడు ఏకంగా ఓ స్వీట్ షాక్ ఇచ్చే న్యూస్ బయటకు రావడం గమనార్హం. అదేంటంటే.. ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి స్వర మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయని తాజా ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉంటే, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమాకు మొదట్నుంచీ యంగ్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా థమన్ కు ఛాన్స్ ఇస్తానని చిరు అంతకుముందే మాట ఇవ్వడం.. ఇటు సురేందర్ రెడ్డితో కూడా థమన్ సినిమాలు చేసి ఉండటం.. ఈ మధ్య ఈ మెగా సినిమాకు తానే సంగీతం అందించబోతున్నట్లు థమన్ కూడా ఇన్ డైరెక్ట్ గా చెబుతుండటం చూస్తుంటే.. అదే నిజం అనుకున్నారు. అయితే, ఇందులో కొంత నిజమున్నా.. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏఆర్ రెహ్మాన్ చేతిలో పెడితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇప్పుడు మెగా టీమ్ డిసైడ్ అయ్యిందట. అందుకే తాజాగా థమన్ ను కాదని, ఏఆర్ రెహ్మాన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా, ఇప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏఆర్ రెహ్మాన్ పేరు వినిపిస్తుండటం చూస్తుంటే.. మెగా టీమ్ ‘ఉయ్యాలవాడ.. ‘ ను భారీ అండ్ క్రేజీ గానే ప్లాన్ చేస్తుందని అర్థమవుతుంది. మరి ఇదే నిజమైతే, ప్రాజెక్టులో భాగం కావడానికి ఏఆర్ రెహ్మాన్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.