చివర్లో చిరు చేసిన ఛాలెంజ్ ఎవరికో..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఇంకా మెగా హీరోలందరూ ఈ వేడుక హాజరయ్యారు.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నాపై విసిరినా మాటల తూటాలకు ఈ సినిమానే ఛాలెంజ్ అని చెప్పారు.. ఇంకా ఈ అభిమానుల ఈలలు, కేకలు, కేరింతలు, చప్పట్లు విని చాలా సంవత్సరాలైంది. వీటి శక్తి ఏంటన్నది అనుభవ పూర్వకంగా తెలిసినవాడిని. కాబట్టి ఈ కేకలు కేరింతలు కోసం చాలా సంవత్సరాలు గా ఎదురుచూసి ఇలా మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఇక్కడున్న అభిమానులను చూస్తూంటే విజయవాడ కృష్ణానదీ తీరా ఉన్నానా? విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అని నాకే అనుమానంగా ఉంది. తుఫాన్ సమయంలో సముద్రం చేసే కోలాహాలాన్ని మించి ఈ రోజున మీ యెక్క కేకలు..కేరింతలు అంతకన్నా ఉదృతంగా ఉన్నాయి. మీరంతా ఆశీస్సులు ఇస్తూ బాస్ కమ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

ఖైదీ కథ కు ముందు చాలా కథలు విన్నా. కానీ ఏ కథ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనిపించలేదు. ఆ సమయంలో మురగదాస్ డైరెక్ట్ చేసిన `కత్తి` సినిమా చూసి రీమేక్ చేస్తే బాగుటుందని డిసైడ్ అయ్యా. అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కథ అనగానే నాకు వినాయక్ అయితేనే బాగుంటుందనిపించింది. మరో డైరెక్టర్ నా దృష్టిలోకి రాలేదు. నా మొదటి విజయం ఈ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయడంగా భావిస్తున్నా. డ్యాన్స్ , ఫైట్స్, ఎమోషన్స్, సామాజిక బాధ్యతను తెలియజెప్పేలా ఆద్యంతం ఆసక్తికరంగా వినాయక్ డైరెక్ట్ చేశాడు. చరణ్ ధృవ సినిమా టైమ్ లో బిజీగా ఉన్నప్పుడు వినాయక్ నిర్మాత బాధ్యతలను కూడా చేపట్టాడు. ఇందులో కాజల్‌ నాతో పోటీ పడి నటించింది. అలాగే సంక్రాంతికి వచ్చే ప్రతీ సినిమా ఆడాలి. నా సోదరుడు బాలకృష్ణ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్‌ ‘శతమానం భవతి’ చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడుకు విచ్చేసిన సుబ్బరామిరెడ్డి గారు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఇతర ప్రముఖులు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు ” అని అన్నారు.