రానా , నవదీప్ లు కూడా ఖైదీల్లో ఉన్నారు..!!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఖైదీనంబ‌ర్ 150 సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుదలైన టీజ‌ర్, మేకింగ్ వీడియో స‌హా అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు, ‘సుందరి’ ఆడియో సాంగ్స్ కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆడియో వేడుక నిర్వహించక పోయినా… అంతకంటే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో ఖైదీనంబ‌ర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌నిర్మాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇప్పుడీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. మెగా ఖైదీ కోసం రానా, నవదీప్ లు రంగంలోకి దిగనున్నారట. మెగా ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం యంగ్ హీరో రానా దగ్గపాటి, నవదీప్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారట. ఈ యంగ్ హీరోలిద్దరు కలసి మెగాస్టార్ రీ-ఎంట్రీకి మరింత గ్లామర్ ని తీసుకురానున్నారు. ముఖ్యంగా మెగా డైలాగ్స్ లో కొన్ని రానా నోటి నుంచి వినడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్, రాంచరణ్ నిర్మాత.