అదిరిపోయిన శాతకర్ణి ఆంధ్ర రేటు..!!

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరోపక్క ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా దీనిని గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ కథానాయికగా నటించగా, తల్లి పాత్రలో హేమమాలిని నటించారు.

ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోయినట్టు చెబుతున్నారు. అయితే, శాతకర్ణి ఆంధ్రా హక్కులు రూ. 21కోట్లకి అమ్ముడుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆంధ్రా ప్రజలకి సెంటిమెంట్ గా కనెక్ట్ అయ్యింది. తెలుగు జాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రప్రంచానికి చాటి చెప్పిన గొప్పచక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అమరావతిని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించారు శాతకర్ణి.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ నేపథ్యంలో.. రానున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఏపీ రాజకీయాల్లో బాలయ్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా శాతకర్ణి ఆంధ్రా హక్కులు అదిరిపోయే రేటు పలికేందుకు దోహదపడినట్టు కనిపిస్తోంది.